: విద్యాసాగర్ రావు ముందు ఉన్న ఐదు ఆప్షన్లు.. ఎటు మొగ్గుతారో మరి!
తమిళనాడులో ప్రభుత్వ స్థాపన దిశగా గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు ఐదు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. న్యాయ నిపుణులతో చర్చించి, ఆపై శశికళ, పన్నీర్ ల బలాబలాలను పరిశీలించి వీటిల్లో ఒక ఆప్షన్ ను ఆయన ఎంచుకోవచ్చని తెలుస్తోంది. వీటిల్లో మొదటిది, అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగి, అంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ ను కొనసాగించడం. ఈ కేసులో దోషిగా తేలితే, శశికళ ఎలాగూ సీఎం పదవిపై కూర్చోలేరన్న సంగతి తెలిసిందే. ఇక రెండోది, అత్యధిక ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉండటంతో వెంటనే ఆమెను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి బల నిరూపణకు ఆదేశించడం.
మూడవ ఆప్షన్ గా, పన్నీర్ సెల్వం చేసిన రాజీనామాను, ఆయన వెనక్కు తీసుకుంటే, ఆమోదం పలికే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే, మొత్తం ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు పెరిగే చాన్స్ ఉంది. ఆయన ముందున్న నాలుగో అవకాశం, అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించడం. ముఖ్యమంత్రిగా పన్నీర్ ఉన్నారు కాబట్టి, ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరవచ్చు. ఇది జరిగిన పక్షంలో పన్నీర్, ఎలాగైనా తాను కొనసాగాలన్న ఉద్దేశంతో, డీఎంకే, కాంగ్రెస్ లను ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ ఆప్షన్ కూడా శశికళ ఆశలపై నీరు చల్లేదే.
ఇక విద్యాసాగర్ ముందున్న చివరి ఆప్షన్... రాష్ట్రపతి పాలన విధించడం. ఆపై ఆరు నెలల్లోగా ఎన్నికలు. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాలని డీఎంకే మినహా మరే పార్టీ కోరుకోవడం లేదని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన విధించినా, ఆ నింద బీజేపీపై పడే అవకాశాలున్నాయి కాబట్టి, తొలుత అన్నాడీఎంకే నేతలకే చాన్స్ ఇవ్వొచ్చని అంచనా.