: ఇన్ఫోసిస్ ఉద్యోగినిని హత్య చేసిన నిందితుడిని కోర్టు ముందే బాదేసిన భూమాతా బ్రిగేడ్ మహిళలు!
పూణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన రసిలా రాజ్ కేసులో నిందితుడు భాబెన్ సైకియాను కోర్టు ముందుకు తీసుకువచ్చిన వేళ, భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. శివాజీనగర్ కోర్టు ఎదుట అందరూ చూస్తుండగానే బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తీ దేశాయ్ సహా, మరో ముగ్గురు సైకియాపై దాడి చేశారు. వీరి దాడి నుంచి నిందితుడిని చాకచక్యంగా పక్కకు తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
కోర్టు ముందే దాడికి దిగిన తృప్తీ దేశాయ్, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, ఆపై హెచ్చరించి వదిలేశామని పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై తృప్తి స్పందిస్తూ, "ఇన్ఫోసిస్ లో జరిగిన ఘటన మహిళల భద్రతపై కొత్త అనుమానాలను రేకెత్తించింది. సైకియా వంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాల్సిందే. అటువంటి వారికి గుణపాఠం చెప్పాలనే మేము దాడి చేశాం" అన్నారు. కాగా, మహిళలకు సమానత్వం కోసం పోరాడుతున్న తృప్తి, గత సంవత్సరంలో కోర్టు అనుమతితో మహిళలకు ప్రవేశం లేని పలు మందిరాలు, మసీదులల్లోకి వెళ్లి వచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.