: అభిమానితో పందెం కాసి ఓడి...డేటింగ్ కు సై అంటున్న టెన్నిస్ భామ
సూపర్ బౌల్ ఆటపై మక్కువతో అభిమానితో పందెం కాసిన టెన్నిస్ క్రీడాకారిణి ఓటమిపాలై డేటింగ్ కు వెళ్లాల్సి వచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కెనడాకి చెందిన టెన్నిస్ స్టార్ ఎగోనీ బౌచర్డ్ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ లో 45వ స్థానంలో కొనసాగుతోంది. ఆమెకు సూపర్ బౌల్ ఆట అంటే బాగా ఇష్టం. దీంతో గత ఆదివారం అట్లాంటా ఫాల్కన్స్, న్యూ ఇంగ్లండ్ పాట్రియోట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను వీక్షిస్తూ, తొలి రౌండ్ ముగిసిన అనంతరం అట్లాంటా విజయం సాధిస్తుందని ఆమె ట్వీట్ చేసింది. ఎందుకంటే అప్పటికి అట్లాంటా జట్టు 28-3 స్కోరుతో ఆధిక్యంలో ఉంది. దీంతో ఆ జట్టుదే విజయమని అభిప్రాయపడింది.
దీంతో ఆన్ లైన్ లో ఉన్న ఓ అభిమాని, 'అయితే ఓ పని చేద్దాం.. సరదాగా పందెం కాద్దాం... నువ్వు ఓడిపోతే నాతో డేటింగ్ కు వస్తావా?' అంటూ సవాల్ విసిరాడు. దీంతో ఆమె కూడా సరదాగా సరే అనేసింది. అభిమాని టంగ్ పవరో లేక ఇంకేదైనా శక్తి నడిపించిందో కానీ, సెకండ్ హాఫ్ లో చెలరేగి ఆడిన న్యూ ఇంగ్లండ్ పాట్రియోట్స్ జట్టు ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 34-28 తేడాతో అట్లాంటాపై విజయం సాధించింది. దీంతో బౌచర్డ్ షాక్ తింది. బెట్టింగ్ లో ఓటమిపాలైన తాను, మాటకు కట్టుబడి తన అభిమానితో డేటింగ్ కు వెళ్తానని తెలిపింది. దీంతో ఈసారి ఆమె అభిమానులు షాక్ తిన్నారు.