: షాకింగ్... ఏడుస్తున్నాడని ఆసుపత్రిలో పసివాడి కాలు విరిచిన వ్యక్తి
పసి పిల్లవాడి పట్ల ఓ వ్యక్తి రాక్షసుడిలా ప్రవర్తించిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆసుపత్రిలో మూడురోజులు కూడా నిండని శిశువు పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించిన ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరాఖండ్ రూర్కీలోని ఓ పిల్లల ఆసుపత్రిలో గతనెల 28న శ్వాస సంబంధమైన సమస్యతో బాధపడుతున్న ఓ మూడు రోజుల బాలుడిని అతడి తల్లిదండ్రులు చేర్పించారు. అక్కడ ఆ బాలుడిని వైద్యులు పరిశీలనలో పెట్టారు. అయితే, అదే గదిలో వార్డు బాయ్ ఉన్నాడు. వార్డు బాయ్ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. అదే సమయంలో ఆ పిల్లాడు ఏడవడం ప్రారంభించాడు. అంతే, ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వార్డు బాయ్ ఆ బిడ్డ వద్దకు వెళ్లి డయాపర్ మార్చే క్రమంలో కోపంతో కాలు మెలేయడంతో ఆ చిన్నారి కాలు విరిగింది.
అనంతరం ఏమీ తెలియనట్లు తన పని తాను చేసుకున్నాడు. అయితే, ఆ చిన్నారి బాధతో మరింత ఏడవడంతో అక్కడికి వచ్చిన వైద్యులు ఆ శిశువు కాలు దెబ్బతినడం గమనించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఆ వార్డు బాయ్ చేసిన నిర్వాకం బయటపడింది. దీంతో నిందితుడిని వైద్యులు పోలీసులకి పట్టించారు.