: ‘బసవ తారకం ఆసుపత్రి’లో ఫేక్ రీసెర్చి నడుస్తోంది .. మా ప్రాణాలకు హాని తలపెడతారు!: ఆర్ అండ్ డి విభాగాధిపతి ఆరోపణలు!
తమ ప్రాణాలకు హాని ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, రీసెర్చి సంస్థకు చెందిన డాక్టర్ ప్రసాద్ ఆరోపించారు. అక్కడ ఆర్ అండ్ డి విభాగాధిపతిగా పని చేస్తున్న ప్రసాద్ బృందం ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, యాజమాన్యంలోని కొందరు తమపై కక్ష కట్టారని అన్నారు. దివంగత సీఎం, ప్రముఖ నటుడు ఎన్ టి రామారావు ఆశయాలకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతోందని, కొన్ని విషయాలు సరైన పద్ధతిలో జరగడం లేదని ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న రీసెర్చిలలో చాలా వరకు కరెక్టు కాదని, ‘ఫేక్ రీసెర్చి’ జరుగుతోందని, రీసెర్చి చేయకుండానే డేటా చూపిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లానని, ఈ విషయమై ఆసుపత్రి బోర్డుకు లేఖలు రాసినా ఫలితం లేకుండాపోయిందని అన్నారు. తాము తాగే టీ, కాఫీల్లో గుర్తించలేని పదార్థాలు కలుపుతున్నట్లు గుర్తించామని, ఈ మేరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగులు కనబరచిన ప్రతిభ గురించి ఆరా తీస్తారని, అయితే, తమ విభాగం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని, తాను అడుగుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదని ఆరోపించారు. ఒక రకమైన భయాందోళనలకు తమను గురిచేస్తున్నారని, తమను వేధించడం, ఒంటరివాళ్లను చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. కేవలం ప్రసాద్ మాత్రమే కాకుండా ఇతర సైంటిస్టులు, స్కాలర్స్ తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ న్యూస్ ఛానెల్ లో ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను ఆసుపత్రి పాలకవర్గం డైరెక్టర్ ఎంవిఎస్ఎస్ మూర్తి కొట్టిపారేశారు.