: ప్రాజెక్టులు కట్టినవారు గొప్ప వాళ్లా? వాటిని ప్రారంభించేవారు గొప్పవాళ్లా?: వైఎస్ జగన్
ప్రాజెక్టులు కట్టినవారు గొప్ప వాళ్లా? వాటిని ప్రారంభించేవారు గొప్పవాళ్లా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉరవకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అనంతపురంకి వచ్చి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని చెబుతున్నారని, రైతుల కోసం పరితపిస్తానని అంటున్నారని జగన్ అన్నారు. కానీ, చంద్రబాబు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు.
2012లోనే కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారని జగన్ అన్నారు. ఎన్నో పనులు పూర్తయినప్పటికీ మిగిలిన పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని జగన్ విమర్శించారు. మరోవైపు ఎప్పుడో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు ఇప్పుడు కొన్ని పూర్తయితే, అవి తానే మొత్తం కట్టానని చెప్పుకుంటూ చంద్రబాబు ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేస్తున్నారని జగన్ విమర్శించారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాలకోసమే చంద్రబాబు పరితపిస్తున్నారని జగన్ అన్నారు. కమీషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారని ఆయన ఆరోపించారు.
రైతుల కళ్లల్లో చంద్రబాబు మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ నిప్పులు చెరిగారు. అనంతపురంకి నీళ్లు ఇస్తున్నామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు నిజంగా నీరు ఇచ్చి ఉంటే ఇక్కడ కరవు మండలాలు ఎందుకు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టే కాదు.. అన్ని ప్రాజెక్టుల వద్దకు వచ్చి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారే తప్పా చంద్రబాబు చేసింది ఏమీ లేదని జగన్ విమర్శించారు.