: వారం రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా పన్నీర్.. శశికళది మూన్నాళ్ల ముచ్చటేనా?
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. 9వ తేదీన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించేందుకు శశికళ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి కోరిక మూన్నాళ్ల ముచ్చటేనా? అనే చర్చ జరుగుతోంది. వారం రోజుల్లో సీఎం పీఠంపై మళ్లీ పన్నీర్ సెల్వం కూర్చుంటారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయలలిత అక్రమాస్తుల కేసులో మరో వారం రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్నారు.
గతంలో ఈ కేసులో జయలలిత, శశికళను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. అయితే, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి, ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాలుగైదు రోజుల్లోనే సుప్రీం తీర్పు వెలువడనుంది. ఒకవేళ, ఈ కేసులో శశికళ దోషిగా తేలితే సీఎం పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి వస్తుంది. దీంతో, ఆమె సీఎం కోరిక మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఆ తర్వాత పన్నీర్ సెల్వమే మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జయకు అత్యంత విధేయుడు అయిన పన్నీర్ కాకుండా మరెవరు సీఎం అయినా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో, తమిళనాడు రాజకీయాలు రానున్న వారం రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయనడంలో సందేహం లేదు.