: నోట్ల రద్దుతో మోదీ కల మరింత దూరం!
నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం, ఆయన తన కలగా చెప్పుకునే 'అచ్చే దిన్'లను మరింత దూరం చేశాయి. నోట్ల రద్దు తరువాత ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా, ఇప్పటికే వృద్ధి రేటు గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గతవారంలో బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్ ముందుకు తెచ్చిన వేళ వెల్లడించారు. బడ్జెట్ కు ఒకరోజు ముందు వచ్చిన ఆర్థిక సర్వేలోనూ ఈ అంశాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ సుబ్రమణియన్ ప్రముఖంగా ప్రస్తావించారు.
నోట్ల రద్దు కారణంగా జీడీపీ పావు నుంచి అర శాతం వరకూ తగ్గుతుందని, 2016-17లో వృద్ధి రేటు 6.5 శాతం వరకూ ఉండవచ్చన్నది ఆర్థిక సర్వే వేసిన అంచనా కాగా, వాస్తవ గణాంకాలు ఇంకాస్త తక్కువకు పరిమితం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి సహా, ఫిచ్ వంటి రేటింగ్ సంస్థలు భారత వృద్ధి గణాంకాలను సవరించాయి. నోట్ల రద్దు తరువాత సగటు ద్రవ్యోల్బణం సైతం పెరిగింది. ప్రస్తుతం సరాసరి ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నా, వాస్తవంగా ఇంకా ఎక్కువగానే ఉంది.
ఇక ప్రభుత్వ ఖజానాకు మాత్రం నోట్ల రద్దుతో లాభం కలిగింది. డిసెంబరులో అడ్వాన్స్ పన్ను చెల్లింపులు భారీగా పెరిగాయి. మరింతమంది పన్ను చెల్లింపుల పరిధిలోకి రావడం కూడా మోదీ సర్కారు సాధించిన మరో విజయం. కిసాన్ వికాస పత్రాలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్యా సమృద్ధి యోజన వంటి ప్రభుత్వ సేవింగ్ స్కీముల్లో చెప్పుకోతగ్గ మొత్తం పెట్టుబడులుగా వచ్చింది. కాగా, వృద్ధి రేటు తగ్గడం, ప్రజల కొనుగోలు శక్తి మందగించడంతో మోదీ చెప్పుకునే మంచి రోజులు రావడానికి మరింత సమయం పట్టవచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.