: అమెరికాలో భార్యను వేధించి పరారైన యువకుడు... మూడేళ్ల తరువాత కూకట్ పల్లిలో పట్టుబడ్డాడు!
అమెరికాలో భార్యను వేధించి ఇండియా పారిపోయివచ్చి, మూడేళ్ల తరువాత పోలీసులకు పట్టుబడిన వైనం హైదరాబాదు శివారు కూకట్ పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కూకట్ పల్లిలోని ప్రగతి నగర్ కు చెందిన లింగారెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసేవాడు. దీంతో అతనికి హైదరాబాదుకే చెందిన స్వప్నారెడ్డితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే స్వప్నారెడ్డిని అమెరికా తీసుకెళ్లిపోయాడు. ఆ తరువాత ఏడాదికే ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.
వేధింపులు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయిన ఆమె అక్కడి పోలీసులను ఆశ్రయించింది. అది తెలుసుకున్న లింగారెడ్డి అమెరికా నుంచి బిచాణా ఎత్తేసి ఇండియా వచ్చేశాడు. తరువాత ఎవరికీ కనపడకుండా దాక్కున్న లింగారెడ్డి ఆ తర్వాత దివ్య అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి కూకట్ పల్లిలో కాపురం పెట్టాడు. ఈ విషయం స్వప్న తల్లిదండ్రులకు తెలియడంతో వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యూహం ప్రకారం లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై హత్యాయత్నం, ఛీటింగ్, 408ఏ కేసులు నమోదు చేశారు. అయితే అతని మోసాలపై అతని రెండో భార్య దివ్యకు తెలుసో లేదో తెలియాల్సి ఉంది.