: పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో మృత్యుహేల.. కూతురుతో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్య!
మూడురోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. అప్పటివరకు అన్ని ఏర్పాట్లు చకచకా ముందుకుసాగాయి. అంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బంధువులతో సందడిగా మారుతుందనుకున్న ఆ ఇంట్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో అందరూ చనిపోతే తమ అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? అని అనుకున్నారో ఏమో.. తమ అంత్యక్రియలకోసం కొంత డబ్బును కూడా అక్కడ ఉంచి, మరీ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. పెళ్లి జరుగుతుందనుకున్న ఆ ఇంట్లో బంధువుల రోదనలు వినిపించాయి.
తమిళనాడులోని ఈరోడ్ లో ఈ విషాదం ఘటన జరిగింది. మూడు రోజుల్లో(ఈ నెల 6న) నిశ్చితార్థం చేసుకోవాల్సిన యువతి తన తల్లిదండ్రులతో పాటు బలవన్మరణానికి పాల్పడింది. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే వారు ఈ పని చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 31 ఏళ్ల కృతిక చిన్నయం పాలెంకు చెందిన యువతి అని, ఆమె తండ్రి, ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ (మనోహరన్)గా పనిచేస్తున్నాడని పోలీసులు వివరించారు. వారంతా విషం తాగి ఈ ఘటనకు పాల్పడ్డారని, నిన్న పాలు అమ్ముకునే వ్యక్తి తలుపు తట్టినా స్పందన రాలేదని, వారి బంధువులు ఈ సమాచారం తెలుసుకొని అక్కడకు చేరుకుని తలుపులు పగలగొట్టారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో మనోహర్ రాసిన మూడు సూసైడ్ నోట్ లు లభించాయని పేర్కొన్నారు. వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారు మూకుమ్మడిగా ఇలా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియాల్సివుంది.