: హోదాతో రాయితీలు రావు.. అది శుద్ధ అబద్ధం.. మరోమారు స్పష్టం చేసిన చంద్రబాబు
ఆంధ్ర్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు రాయితీలు వస్తాయనడం శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోమారు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేసిన గమేశా విండ్ పవర్ ప్లాంట్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని ప్రత్యేక హోదాలో లేదన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వమే రాయితీలు అందిస్తుందన్నారు. హోదాలోని అన్ని లాభాలు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి అందుతాయన్నారు.
విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలలో పరిశ్రమలు పెట్టేవారికి వడ్డీ సబ్సిడీ ోసం కేంద్రం రూ.వంద కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక హోదాపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. భూసేకరణ, ఇతర అంశాలపైనా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు.