: రణరంగంగా మారిన నాగాలాండ్... రంగంలోకి దిగిన సైన్యం
నాగాలాండ్ ప్రభుత్వానికి, గిరిజనులకు మధ్య తలెత్తిన మునిసిపల్ ఎన్నికల వివాదంతో రాష్ట్రం రణరంగంగా మారగా, పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాష్ట్రంలోని 32 మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసి 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించడంతో గొడవ ప్రారంభమైంది. మహిళలకు రిజర్వేషన్లు తమ ఆచారానికి విరుద్ధమంటూ, నాగా గిరిజనులు విధ్వంసానికి దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో, పెద్దల తీరును నిరసిస్తూ, ఉద్యమం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో సీఎం టీఆర్ జెలియాంగ్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించగా, వారి అంత్యక్రియల ర్యాలీలో మరింత విధ్వంసం జరిగింది. దీంతో కేంద్రం ఐదు బెటాలియన్ల సైన్యాన్ని రంగంలోకి దించగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అసోం రైఫిల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా, నిరసనలు, హింసాత్మక ఘటనల్లో ఎంతమంది మరణించారన్న విషయమై అధికారిక సమాచారం తెలియాల్సివుంది.