: దేశంలోని 97,923 పాఠశాలల్లో కేవలం ఒకే ఒక్క టీచర్!
పాఠశాలల్లో సరైన విద్యాప్రమాణాలు కావాలంటే అవసరమైనంతమంది టీచర్లు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. అయితే పార్లమెంటులో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర కుశ్వాహ సమాధానం దేశాన్ని విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... దేశవ్యాప్తంగా 97,923 పాఠశాలలు కేవలం ఒక్క టీచర్ (ఏకోపాథ్యాయుడు) తోనే నడుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ మొత్తం పాఠశాలల్లో 8.84 శాతం పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2015-16 నివేదిక తెలియజేస్తున్న వివరాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.
ఈ సందర్భంగా రిక్రూట్ మెంట్, సర్వీసు నిబంధనలు, పునర్నియామకం వంటి అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నాయని ఆయన చెప్పారు. అవసరం మేరకు ఉద్యోగాల భర్తీ చేయాల్సింది రాష్ట్రాలేనని ఆయన తెలిపారు. అంతే కాకుండా సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ వంటి పథకాల కింద అదనపు టీచర్లను నియమించుకునేందుకు కేంద్రం అదనంగా ఆర్థిక సహకారం అందజేస్తున్నదని ఆయన తెలిపారు. అంతే కాకుండా టీచర్, విద్యార్థి నిష్పత్తిని నిర్వహించేందుకు వీలుగా రిక్రూట్‌మెంట్లు, పునర్నియామకాలపై కేంద్రం నిరంతరాయంగా పరిశీలిస్తుందని ఆయన తెలిపారు.