: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ‘బాహుబలి’ అవతారమెత్తారు!


ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ఎంతగా ప్రశంసలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ‘బాహుబలి’ పేరు మారుమోగిపోయింది. ఎవరైనా బలశాలి కనపడితే అతన్ని ‘బాహుబలి’తో పోల్చుతూ, వినాయక చవితికి ‘బాహుబలి’ పేరిట విగ్రహాలు, క్రిస్మస్ కు ‘బాహుబలి’ కేక్ లు పుట్టుకొచ్చిన సంగతి విదితమే. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరో ప్రభాస్ శివలింగాన్ని అమాంతం తన భుజంపైకి ఎత్తుకుని వెళ్లే దృశ్యం, ఆ సమయంలో బ్యాక్ గ్రౌండ్ పాట ప్రేక్షకులను ఎంతగా కట్టిపడేసాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీన్ గురించే ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. ఉత్తరాఖండ్ సీఎం, కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ తాజాగా ‘బాహుబలి’ అవతారమెత్తారు.

ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాస్త్రం కింద ‘బాహుబలి’లోని ఈ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నారు. ‘ఎవ్వరంట.. ఎవ్వరంట..’ అనే పాట బ్యాక్ గ్రౌండ్ తో ‘బాహుబలి-2’ పేరిట ఉత్తరాఖండ్ లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలి గా హరీశ్ రావత్ కనిపిస్తారు. ఆయనకు ఎదురుగా మ్యాప్ ఆకారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. దానిని తన భుజాల పైకి ఎత్తుకుని హరీశ్ రావత్ నడిచి వెళ్తుంటే.. దానిని చూసి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆశ్చర్యపోతున్న దృశ్యం మనకు కనపడుతుంది.

మరో విషయమేమిటంటే.. ‘బాహుబలి’లో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకుని తన భుజంపై పెట్టుకున్నప్పుడు సాధువు పాత్రలో కనిపించిన నటుడు తనికెళ్ల భరణి ఎంతగానో ఆశ్చర్యపోతాడు. ఈ వీడియోలో అదే పాత్రలో ప్రధాని నరేంద్ర మోదీని చూపిస్తారు. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీశ్ రావత్ అనే టైటిల్ వస్తుండగా ‘ఎవ్వరంట..ఎవ్వరంట..’ అనే పాట మొదలవడం.. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ ప్రాంతాల చిత్రాలు ఒక దాని తర్వాత మరోటి  స్పీడ్ గా కదిలిపోగానే హరీశ్ రావత్ కనిపించడం గమనార్హం. ‘బాహుబలి’ చిత్రంలోని ఈ సన్నివేశాల్లోని నటీనటుల ముఖాలను మార్ఫింగ్ చేసి, ఈ వీడియోను ఉత్తరాఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రూపొందించింది.  

  • Loading...

More Telugu News