: ఆ చట్టాల ప్రకారం అమెజాన్‌పై చర్యలు తీసుకుంటాం: కేంద్ర ప్రభుత్వం
తెలిసి చేసిందో.. తెలియక చేసిందో గానీ భారత జాతీయ పతాకంతో ఉన్న డోర్‌మ్యాట్లను అమ్మకానికి పెట్టి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతీయులకు ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. అనంతరం ఆ డోర్‌మ్యాట్‌లను తమ వెబ్‌సైట్ నుంచి తొలగించిన అమెజాన్.. మళ్లీ అటువంటి చర్యకే పాల్పడుతూ మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించిన చెప్పులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి దురంహంకారాన్ని ప్రదర్శించింది. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర సర్కారు అమెజాన్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
రాజ్యసభలో సభ్యులు దీనిపై ఆందోళన వ్యక్తం చేయగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ ఈ విషయమై సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. అమెరికా, కెనడాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ సంస్థ అధినేత దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారని చెప్పారు. దీంతో వాటిని తమ వెబ్‌సైట్ నుంచి తొలగించడంతో పాటు ఇకపై జాగ్రత్త వహిస్తామంటూ అమెజాన్ లేఖ ద్వారా తెలిపిందని అన్నారు. అయితే, ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి చట్టాలు లేవని ఆయన తెలిపారు. అయినప్పటికీ 1950, 1971 చట్టాల పరిధిలో దేశ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా తగిన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.