: నయీంతో విందు వినోదాల్లో మునిగి తేలిన పోలీసు అధికారులు...దొరికిన సాక్ష్యాలు!
తెలుగు రాష్ట్రాలను గడగడలాడించి, వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి, చివరికి పోలీస్ ఎన్ కౌంటర్లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీంతో పోలీసు, రాజకీయ ప్రముఖులకు ఎలాంటి సంబంధాలు లేవని సిట్ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నయీం దందాకు సహకరించిన పోలీసుల వ్యవహారాలు బట్టబయలు చేస్తున్న కొన్ని ఫోటోలు తాజాగా వెలుగు చూశాయి. సుమారు 16 మంది పోలీసు ఉన్నతాధికారులు నయీంతో విందువినోదాలు చేస్తున్న ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఈ ఫోటోలు పోలీసుల చేతికి చిక్కినప్పటికీ సిట్ అధికారులు ఆ ఫోటోలలో వున్న వారిని పక్కకి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నయీం పోలీసు అధికారుల సాయంతోనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడని, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని ఈ ఫోటోలు పేర్కొంటున్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. విపక్షాలు సీబీఐ విచారణ కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరించడం, నయీం ఇళ్లపై దాడులు చేస్తున్న సందర్భంగా పట్టుబడ్డ నగదు, నగలు, డాక్యుమెంట్లను గోల్ మాల్ చేయడానికేనని బాధితులు ఆరోపిస్తున్నారు.