: గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి.. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే కన్నుమూశారు!
గుండెపోటుతో నిన్న పార్లమెంటులోనే కుప్పకూలిపోయిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ఇ.అహ్మద్ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రవేశపెట్టాలనుకున్న బడ్జెట్ ను వాయిదా వేస్తారా? అన్న ప్రశ్న అందిరిలోనూ మెదిలింది. అయితే, చివరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా, గతంలోనూ రెండుసార్లు ఇటువంటి ఘటనలే జరిగాయి. 1971లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే మంత్రి ఎంబీ రానా మృతి చెందారు. అయినప్పటికీ అప్పటి స్పీకర్ జీఎస్ థిల్లాన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతకు ముందు 1954, ఏప్రిల్ 19న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు సిట్టింగ్ ఎంపీ జుజుహర్ పాల్ సోరియన్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ రెండు ఘటనలు జరిగిన సమయంలో ఆనాడు లోక్‌సభ ఉదయం సమావేశమై మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించి కొన్ని గంటల పాటు సభను వాయిదా వేసి, తిరిగి అదే రోజు సాయంత్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎంపీ మృతి చెందినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శల పట్ల స్పందించిన అధికార పార్టీ సభ్యులు ప్రధానమంత్రి మోదీ సర్కారు కూడా పాత బాటలోనే పయనిస్తూ సంప్రదాయాలను గౌరవించి బడ్జెట్‌ను వాయిదా వేయలేదని తేల్చిచెబుతున్నారు.