: పనిచేసే అమ్మాయిలను పెళ్లి కూతుళ్లుగా చూపుతూ దందా... 'న్యూ లైఫ్' మ్యారేజ్ బ్యూరో బండారం బట్టబయలు!
టెలీకాలర్లుగా కొంతమంది అమ్మాయిలను నియమించుకుని, వారినే పెళ్లి కూతుళ్లుగా చూపుతూ, అమాయకులైన అవివాహితులను లక్ష్యంగా చేసుకుని డబ్బు దండుకుంటున్న 'న్యూ లైఫ్' మ్యారేజ్ బ్యూరో బండారం బట్టబయలైంది. తనకు ఓ యువతిని ఫోన్లో పరిచయం చేసి, రూ. 3 వేలు కట్టించుకుని, ఆపై సంబంధం చూపలేదని హైదరాబాద్, వనస్థలిపురంకు చెందిన సునీల్ అనే యువకుడు చేసిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాఫ్తు జరిపి మ్యారేజ్ బ్యూరో చేస్తున్న నిర్వాకాన్ని వెలుగులోకి తెచ్చి, బ్యూరో నడుపుతున్న ఎస్.వాసవి, వి.లక్ష్మీదేవి అనే మహిళలను అరెస్ట్ చేశారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, వీరు గత సంవత్సరం నవంబరులో, ఓ పత్రికలో ప్రకటన ఇస్తూ, 30 ఏళ్ల వధువుకు వరుడు కావాలని, ఆమెకు సాలీనా రూ. 14 లక్షల వేతనం వస్తుందని, సొంత ఇల్లు, 10 ఎకరాల పొలం, 10 ఎకరాల కొబ్బరితోట, రూ. 6 కోట్ల ఆస్తి ఉందని, మధ్య తరగతికి చెందిన వరుడు కావాలని తెలిపారు. దీనిపట్ల ఆకర్షితుడైన సునీల్, వారు ఇచ్చిన నంబరుకు ఫోన్ చేయగా, తప్పుడు ప్రొఫైల్ చూపించి రూ. 3 వేలు రిజిస్ట్రేషన్ ఫీజుగా కట్టించుకున్నారు. ఆపై తమ వద్ద టెలీకాలర్ గా పనిచేస్తున్న అమ్మాయితో వారు ఫోన్ చేయించారు. మరో వారంలో కలుద్దామని చెప్పించారు. ఆపై సునీల్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్టు గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ఛేదించిన పోలీసులు నిందిత మహిళలు గతంలోనూ ఇదే విధంగా పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేసినట్టు తేల్చారు.