: ఆర్థిక సర్వే స్వీట్ న్యూస్.. దిగిరానున్న ఇళ్ల ధరలు!
సామాన్యులకు తీపి కబురు. ఆకాశంలో విహరిస్తున్న ఇళ్ల ధరలు నేలపైకి దిగిరానున్నట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ఉన్న దారులు మూసుకుపోవడంతో త్వరలో ఇళ్ల స్థలాలు, గృహాల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని సర్వే పేర్కొంది. తద్వారా సామాన్యుల సొంత ఇంటి కోరిక నెరవేరుతుందని తెలిపింది.
నోట్ల రద్దు తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న సొమ్మును బ్యాంకుల్లో జమ చేయడంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఎవరూ దృష్టి సారించడం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని ఎనిమిది ముఖ్య నగరాల్లో రియల్ ధరలు గణనీయంగా పడిపోయినట్టు సర్వే వెల్లడించింది. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉండడంతో సొంతింటి కోసం మధ్య తరగతి ప్రజలు కంటున్న కలలు సాకారమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగంపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు కానుండడంతో పన్నుల రూపేణా ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుంది. పన్ను తగ్గించడంతోపాటు స్టాంప్ డ్యూటీని కూడా ప్రభుత్వం తగ్గించనున్నట్టు సర్వే పేర్కొంది. అదే జరిగితే ఇళ్ల స్థలాలు, గృహాల ధరలు అందరికీ అందుబాటులోకి వస్తాయని సర్వే వివరించింది.