: హెచ్-1బీ వీసాలపై ప్రతినిధుల సభకు బిల్లు... 1.30 లక్షల డాలర్ల వేతనమిస్తేనే వీసా... అన్నంతపనీ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంతపనీ చేశారు. హెచ్1-బీ వీసాలపై ప్రస్తుతమున్న నిబంధనలను కఠినాతి కఠినం చేస్తూ తయారు చేసిన బిల్లును ప్రతినిధుల సభకు పంపారు. హెచ్1-బీ వీసాలపై ఉద్యోగులను తీసుకు వచ్చే కంపెనీలు చెల్లించాల్సిన 60 వేల డాలర్ల వేతనాన్ని ఏకంగా 1.30 లక్షలకు పెంచారు. 1989 నాటి వీసా నిబంధనలే ఇప్పటికీ అమలవుతున్నాయని, వీటిని సవరించాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తన నిర్ణయంతో వీసా దరఖాస్తులు తగ్గుతాయని, మరింత మంది అమెరికన్లకు ఉపాధి లభిస్తుందని, వెంటనే ఈ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కాగా, 'ది హై-స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్ నెస్ యాక్ట్ ఆఫ్ 2017' పేరిట తయారైన ఈ బిల్లును కాలిఫోర్నియా కాంగ్రెస్ మెన్ జోయ్ లాఫ్ గ్రీన్ సభలో ప్రవేశపెట్టారు. మార్కెట్ ఆధారిత డిమాండ్ ఆధారంగా వీసాలను జారీ చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో పోలిస్తే 200 శాతం వరకూ కంపెనీలు ఇవ్వగలవని తమ సర్వేలో తేలిందని, అయినప్పటికీ, తక్కువ వేతనాలకు విదేశీయులను తెస్తూ, ఇక్కడి వారికి కంపెనీలు అన్యాయం చేస్తున్నాయని ఆయన అన్నారు. అమెరికా ప్రతినిధుల ముందుకు వచ్చిన ఈ బిల్లు ఇప్పుడు భారత ఐటీ కంపెనీల్లో కలకలం రేపుతోంది.