: వరుసగా రెండుసార్లు ఓడితే మూడోసారి 'నో' టికెట్.. తెలంగాణ కాంగ్రెస్ కొత్త నిర్ణయం!
2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ఏడాదిముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఇదివరకే పేర్కొన్న ఆ పార్టీ, టికెట్ల విషయంలో మాత్రం కొంత కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ మేరకు అధిష్ఠానానికి పంపించేందుకు కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల వివరాలు, వారి చరిత్ర, వచ్చిన ఓట్లు, ఎన్నిసార్లు గెలిచారు, పార్టీ కోసం ఎలా పనిచేస్తున్నారు.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ స్వతంత్ర సంస్థతో సర్వే చేయిస్తున్నట్టు సమాచారం.
గత ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిన అభ్యర్థులకు ఈసారి టికెట్ ఇవ్వకూడదనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గతంలో జరిగిన ఎన్నికల్లో 25 వేల కన్నా తక్కువ ఓట్లు వచ్చినవారిని ఈసారి పక్కనపెట్టడమే నయమని, వారికి టికెట్ ఇచ్చినా లాభం లేదని భావిస్తోంది. అలాగే మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులను కూడా పక్కనపెట్టి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ యోచిస్తోంది. ఈ విషయంలో మొహమాటలకు పోకూడదని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. టీపీసీసీ పంపనున్న ప్రతిపాదనలకు అధిష్ఠానం ఆమోదముద్ర వేస్తే 35 మంది వరకు పాత వారికి ఈసారి టికెట్లు గల్లంతవుతాయి.