: నాడు ఫీజ్ కట్టలేక బడికి దూరం.. నేడు రెజ్లర్ గా కీర్తి కిరీటం!
ప్రముఖ రెజ్లర్ దలీప్ సింగ్ రానాను ‘ది గ్రేట్ ఖాలి’ గా అభిమానులు ఆరాధిస్తుంటారు. రెజ్లింగ్ లో పట్టు సాధించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దలీప్ సింగ్ తన ఆత్మకథను ‘ది మ్యాన్ హూ బికేమ్ ఖాలి’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో తన చిన్నవయసులో పాఠశాల ఫీజు కట్టలేక పొందిన వేదన, అవమానం, రెజ్లర్ కావాలనే ఆసక్తి తదితర విషయాలను ప్రస్తావించారు.
వినిత్ కె.బన్సల్ తో కలిసి దలీప్ సింగ్ రూపొందించిన ఈ పుస్తకంలో 1979లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించాడు. రెండో తరగతి చదువుతున్న సమయంలోఉపాధ్యాయులు చెప్పేది తనకు అర్థమయ్యేది కాదని, అంతేకాకుండా, పాఠశాల ఫీజు తాను కట్టలేకపోవడంతో యాజమాన్యం తిట్టిపోసేదని, తోటి విద్యార్థులు తనను చూసి నవ్వుతుండేవారని పేర్కొన్నాడు. ఫీజు కట్టకపోవడంతో ప్రిన్సిపాల్ ఇబ్బంది పెడుతుండేవాడని, ఈ బాధ పడలేక చదువు మానేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.
ఓ సారి దలీప్ తండ్రి వద్దకు ఓ వ్యక్తి వచ్చి గ్రామంలో తోట పని ఉందని, రోజుకు రూ.5 వస్తాయని చెప్పాడట. అప్పట్లో చేతిలో రెండు రూపాయలు కూడా లేని సమయంలో రోజుకు ఐదు రూపాయలు వస్తాయంటే తనకు చాలా సంతోషం వేసిందని, కష్టపడి పని చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పాడు. అయితే, దలీప్ ది చిన్నవయసు కావడం, అంత బలం ఉండదని భావించి దలీప్ కు పని ఇచ్చేందుకు ఆ వ్యక్తి ఒప్పుకోలేదట. అయితే, ఎనిమిదేళ్ల వయసు ఉన్న దలీప్, ఏదో విధంగా పని సంపాదించి తల్లిదండ్రులకు సాయపడ్డాడట. పని చేసుకుంటూ, రెజ్లర్ కావాలనే తన కలను సాకారం చేసుకున్నానని చెప్పాడు. అయితే, ఒకప్పటి తన ఆకారాన్ని చూసి ఎగతాళి చేసే వారని, దానిని పాజిటివ్ గా తీసుకుని తన లక్ష్యాన్ని సాధించానని, వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవడంతో అన్ని భయాల నుంచి బయటపడ్డానని తన ఆత్మకథలో దలీప్ పేర్కొన్నాడు.