: పార్లమెంటుకు వెళ్లిన ప్రతిసారీ బీజేపీ ఎంపీలు నన్ను చూసి అయోమయానికి గురవుతున్నారు!: టీడీపీ ఎంపీ మాగంటి బాబు
తాను ఓవర్ కోట్ వేసుకుని వెళ్లి బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ దస్త్రాలపై సంతకం చేస్తే అవి అమలవుతాయని టీడీపీ ఎంపీ మాగంటి బాబు చమత్కరించారు. ఈయన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలా ఉంటారన్న అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయనలా స్పందించారు. ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఆయన సవివరంగా చెబుతూ, తాను పార్లమెంటుకు వెళ్లిన ప్రతిసారి బీజేపీ ఎంపీలు అయోమయానికి గురయ్యారని చెప్పారు. తాను అచ్చం అమిత్ షాలా ఉండడంతో అంతా తనను ఆయన అనుకుని దగ్గరకు వచ్చి తనను చూసి ఆయన కాదని నిర్ధారించుకుని వెళ్లిపోయేవారని, ఆ సందర్భంగా తాను అచ్చం అమిత్ షాలా ఉన్నానని పేర్కొనేవారని అన్నారు.
తాను కేంద్రంలో పనులు చేయించుకునేందుకు పులసల కూర, పూతరేకులు వంటివి ఎరవేస్తుంటానని చెప్పడం అవాస్తవమని ఆయన చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజల సహజ లక్షణం మంచి ఆతిథ్యమని ఆయన తెలిపారు. తమ గోదావరి జిల్లాల ప్రజలు ఎవరికైనా సరే ఉత్తమ ఆతిథ్యం ఇస్తారని, అలాగే తాను కూడా మంచి ఆతిథ్యమిస్తాను తప్ప అందులో ఎలాంటి ప్రత్యేకత ఉండదని ఆయన చెప్పారు. కొల్లేరులో తనకు సెంటు భూమి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఆ తరువాత రాజకీయాల్లో ఉండనని ఆయన స్పష్టం చేశారు. 60 ఏళ్ల తరువాత రాజకీయాల్లో ఉండడం సరికాదని ఆయన తెలిపారు. తరువాత దేవుడు ఎలా నిర్ణయిస్తే అది జరుగుతుందని ఆయన తెలిపారు. 60 ఏళ్ల తరువాత రాజకీయాల్లో ఉండకపోవడం తన నిర్ణయమని, చంద్రబాబుగారికి వర్తించదని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని ఆయన తెలిపారు.