: మేమిద్దరం మంచి స్నేహితులం...ఇప్పుడు కలిసి పని చేస్తాం: రాహుల్, అఖిలేష్ యాదవ్
రాహుల్, తాను మంచి స్నేహితులమని, ఇప్పుడు కలిసి పని చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముందు రాహుల్ గాంధీతో కలిసి అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తామిద్దరం సైకిల్ కు రెండు చక్రాలలాంటి వాళ్లమని అన్నారు. తమది ప్రజా కూటమి అని ఆయన పేర్కొనగా, తమది గంగా, జమున సంగమమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ కూటమి యూపీ ఎన్నికల్లో 300 కుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఒక్కచోటుకి చేరుస్తామని ఆయన అన్నారు.
సైకిల్ తో కలిసి చేయి, చేయి కలిపి పనిచేస్తామని వారిద్దరూ స్పష్టం చేశారు. అఖిలేష్ మంచి వ్యక్తి అయినా ఆయనను సరిగా పనిచేయనీయలేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. విభజించు, పాలించు రాజకీయాలకు మంచి సమాధానం చెబుతామని ఆయన అన్నారు. తమ రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నప్పటికీ నియంతృత్వ ఆరెస్సెస్, బీజేపీని ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. తామిద్దరం ఒకే లక్ష్యంతో పని చేస్తున్నామని, అది బీజేపీ, ఆరెస్సెస్ ఓటమేనని వారు స్పష్టం చేశారు.