: కంటినిండా నిద్ర పోకపోతే ఏమవుతుందో తెలుసా?.. పరిశోధనకారులు చెబుతున్నది ఇదే..!
పొద్దంతా కష్టపడిన మనిషికి నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి కంటినిండా నిద్రపోకపోతే ఏమవుతుంది? ఇదే విషయంపై పరిశోధన చేసిన అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని కనుగొన్నారు. మనిషికి సరిపడా నిద్రలేకపోతే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ క్షీణించిపోతుందని వారి అధ్యయనంలో తేలింది. రోజుకు ఏడు, అంతకంటే ఎక్కువ గంటల నిద్ర అవసరమని పరిశోధనకు నేతృత్వం వహించిన నేథానియెల్ వాట్సన్ పేర్కొన్నారు. సరిగా నిద్రలేకపోతే ఎందుకు నీరసంగా కనిపిస్తారన్న అంశంపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు 11 జతల కవలలపై పరిశోధన నిర్వహించారు. వారి నిద్ర అలవాట్లలో మార్పులు సూచించిన అనంతరం రక్త నమూనాలను పరీక్షించారు. సరిపడ నిద్రపోని వారిలో రోగ నిరోధక శక్తి క్షీణించినట్టు గుర్తించారు. నిద్రలేమి ప్రభావంలో 31 నుంచి 55 శాతం జన్యువులపైనా, మిగతాది ప్రవర్తన పైనా పడుతుందని వాట్సన్ వివరించారు. శరీరానికి సుఖ నిద్ర ఇవ్వడంలో అలసత్వం వద్దని పేర్కొన్నారు.