: టీమిండియాకు నేడు చావోరేవో.. ఓడితే సిరీస్ ఫట్.. గెలిస్తే ఆశలు సజీవం!
ఇంగ్లండ్ తో జరిగిన తొలి టి20లో ఓటమి పాలైన టీమిండియా నేడు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన భారత్.. నేడు నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంటాయి. పరాజయం పాలైతే కనుక ఇంగ్లండ్ సిరీస్ దక్కించుకుంటుంది. తొలి టి20లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఈసారి ఆ తప్పులు దిద్దుకుని బరిలోకి దిగాలని యోచిస్తోంది.
తొలి మ్యాచ్‌లో ఓపెనింగ్ సమస్య కొట్టొచ్చినట్టు కనిపించింది. వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన లోకేశ్ రాహుల్ తొలి టి20లోనూ విఫలమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అలాగే పర్వేజ్ రసూల్ స్థానంలో సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను బరిలోకి దింపే అవకాశం ఉంది. నాగ్‌పూర్ మైదానం పెద్దది కావడం మిశ్రాకు కలిసివచ్చే అంశం. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లిష్ జట్టు నాగ్‌పూర్‌లోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.