: తమిళపార్టీలను మించిపోయిన యూపీ బీజేపీ మ్యానిఫెస్టో
తమిళనాడులో ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలన్నీ తాము ప్రవేశపెట్టబోయే ఉచిత పథకాల గురించి వల్లే వేస్తూ ఓటర్లకు గాలమేస్తాయన్న సంగతి విదితమే. ఇప్పుడు తమిళనాడు రాజకీయ పార్టీలను మించిపోయిన రీతిలో బీజేపీ ఉత్తరప్రదేశ్ ఓటర్లకు తాయిలాలు ప్రకటించింది. గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ ఇలాంటి తాయిలాలనే ప్రకటించింది. అయితే నితీష్ కుమార్, లాలూ ప్రణాళికల ముందు ఆ పార్టీ ఆటలు సాగలేదు. ఈ సారి ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ-కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ మధ్య నెలకొన్న త్రిముఖ పోరులో విజయం సాధించేందుకు రచించిన మ్యానిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. దీనికి ‘లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర్’ అని పేరు కూడా పెట్టారు. దాని వివరాల్లోకి వెళ్తే...
1) యువతకు 1జీబీ ఉచిత ఇంటర్నెట్ తో కూడిన ల్యాప్ టాప్ లు ఫ్రీ.
2) యూనివర్శిటీల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తాం.
3) రైతుల రుణాలు మాఫీ చేస్తాం.
4) ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తాం.
5) రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి రానున్న ఐదేళ్లలో 150 కోట్ల రూపాయలు కేటాయిస్తాం.
6) ప్రభుత్వ ఉద్యోగాల్లో 3, 4 తరగతి ఉద్యోగాలకు ముఖాముఖి రద్దు చేసి, ఉద్యోగ నియామకాల్లో అవినీతి అరికడతాం.
7) ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన 10 కొత్త యూనివర్శిటీలను ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేస్తాం.
8) 12వ తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యను అమలు చేస్తాం.
9) భూ, గనుల మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తాం.
10) డయల్ 100 సర్వీసును మరింత మెరుగుపరిచి, ఘటనాస్థలికి 15 నిమిషాల్లో పోలీసులు చేరుకునేలా చర్యలు తీసుకుంటాము.
11) రాష్ట్రంలోని పోలీసు శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.
12) వ్యవసాయరంగ అభివృద్ధిలో భాగంగా నీటి పారుదలకు 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం.
13) రాజ్యాంగం, చట్టాలు అనుసరించి వీలైనంత త్వరలో రామమందిర నిర్మాణం పూర్తి చేస్తాం.
14) వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గృహాలకు 24 గంటల విద్యుత్తు అందేలా చర్యలు తీసుకుంటాం.
15) 90 శాతం యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం