: కోర్టులో 65 ప్రశ్నలకు సమాధానం చెప్పిన సల్మాన్ ఖాన్!
కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా కోర్టులో విచారణకు ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా సల్మాన్ స్పందిస్తూ, తాను హిందువునని, ముస్లింనని, ఓ భారతీయుడినని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తొలుత హిందీలో సమాధానం చెప్పిన సల్మాన్... ఆ తర్వాత ఇంగ్లీషులో కూడా చెప్పాడు. మరోవైపు తనపై తప్పుడు అభియోగాలు మోపారని కోర్టుకు తెలిపాడు. తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు. మొత్తం 65 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తన సహనటుల సమక్షంలోనే సల్మాన్ సాక్ష్యాన్ని నమోదు చేశారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో, సల్మాన్ ఖాన్ రెండు జింకలను చంపాడనే ఆరోపణలతో... 1998లో ఆయనపై కేసు నమోదైంది.