: రాష్ట్రంలోనూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డీఆర్ఎఫ్) స్ఫూర్తిగా రాష్ట్రంలోనూ విపత్తు స్పందన దళాలను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ డీఆర్ఎఫ్) పేరిట రాష్ట్రంలో మూడు చోట్ల ఈ ప్రత్యేక దళాలను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో ఈ కేంద్రాలు నెలకొల్పనున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల కారణంగా చోటు చేసుకునే ఘటనలను ఈ దళాలు సమర్థంగా ఎదుర్కొంటాయి. ఈమేరకు రాష్ట్ర దళాలకు జాతీయ విపత్తు స్పందన దళం తర్ఫీదునిస్తుంది. కాగా, ఒక్కో కేంద్రంలో 120 మంది సభ్యులు ఉంటారు. త్వరలోనే మరికొందరి నియామకం చేపడతారు.
ఈ విషయమై రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ టి. రాధ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అవడంతో హైదరాబాద్ లోనూ, ప్రముఖ ఆధ్మాత్మిక కేంద్రం కావడంతో తిరుపతిలోనూ, రాష్ట్రంలో అతి పెద్ద ఓడరేవు, పారిశ్రామిక కేంద్రం కావడంతో విశాఖలోనూ ఈ విపత్తు స్పందన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.