: టాయిలెట్లలో సీసీ కెమెరాలు.. అందులోకి వెళ్లాలంటే ప్యాంటు బయట విప్పాల్సిందే! కోవై కళాశాల యాజమాన్యం విపరీత చర్య
విద్యార్థుల టాయిలెట్లలో సీసీ కెమెరాలు అమర్చిన ఓ కాలేజీ యాజమాన్యం తీరు కలకలం రేపుతోంది. తమిళనాడు కోయంబత్తూరులోని కోవైపుదూరులో ఉన్న వీఎల్బీ జానికియమ్మాళ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యాజమాన్యం మరుగుదొడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతేకాదు మరుగుదొడ్లలోకి వెళ్లే విద్యార్థులు ప్రవేశ ద్వారం వద్ద ప్యాంట్లు విడిచి అక్కడున్న లుంగీని కట్టుకుని లోపలికి వెళ్లాలంటూ ఆంక్షలు విధించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. కళాశాల తీరుపై ఇప్పుడు సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థుల టాయిలెట్లలో సీసీ కెమెరాలు ఏంటంటూ నిలదీస్తున్నారు. ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కళాశాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే టాయిలెట్లలో ఊరికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ఇటీవల స్టాఫ్రూంలోని టాయిలెట్లో తుంటరి విద్యార్థులు పెట్టిన నాటుబాంబు పేలి తొండైతున్నె అనే లెక్చరర్ గాయపడ్డారని, అందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది.