: జల్లికట్టు ఉద్యమంలో ప్రత్యేక తమిళ దేశం డిమాండ్లు.. ఉగ్రవాది లాడెన్ ఫొటోలతో ర్యాలీ
ఇటీవల తమిళనాడులో పెద్ద ఎత్తున జరిగిన జల్లికట్టు ఉద్యమంలో ప్రత్యేక తమిళ దేశం కోసం డిమాండ్ చేశారా? అవుననే అంటున్నారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. జల్లికట్టు ఆందోళనలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటోలతో అల్లరిమూకలు ర్యాలీలు కూడా నిర్వహించాయని శుక్రవారం ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. ఉద్యమంలోకి ప్రవేశించిన దుష్టశక్తులు ఆందోళనలు కొనసాగించేందుకు చివరి వరకు ప్రయత్నించాయన్నారు. ఆందోళనను పక్కదోవ పట్టించాయని అన్నారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసుకురాగానే కావేరి, ముల్లైపెరియార్ డ్యాం సమస్యలను పరిష్కరించడంతోపాటు తమిళనాడును ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారని ముఖ్యమంత్రి వివరించారు. వారి ఆగడాలు పెచ్చుమీరడంతోనే పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారన్నారు. ఆందోళనలోకి చొరబడిన అసాంఘిక శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పన్నీర్ సెల్వం హెచ్చరించారు.