: 'పంజాబ్ ముఖ్యమంత్రి ఆయనే' అంటూ కుండబద్దలు కొట్టిన రాహుల్ గాంధీ
'తదుపరి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగే'నని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ప్రముఖ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ చేరిక అనంతరం ఆయనతో కాంగ్రెస్ లోపాయకారీ ఒప్పందం చేసుకుందని, భవిష్యత్ పంజాబ్ సీఎం సిద్ధూయేనంటూ అక్కడ వార్తలు వెల్లువెత్తాయి. దీనికి తోడు సిద్ధూ పార్టీలో చేరుతూనే బీజేపీ-అకాళీదల్ కూటమిపై నిప్పులు చెరిగారు. ఆప్ ను కూడా విమర్శించారు. దీంతో సిద్ధూ ఫాలోయింగ్ కాంగ్రెస్ కు తోడవుతుందని, పంజాబ్ లో సానుకూల ఫలితాలు వస్తాయంటూ విశ్లేషణలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి అమరీందర్ సింగేనని, తాను బేషరతుగానే పార్టీలో చేరానని సిద్ధూ ప్రకటించారు. అయినప్పటికీ ఆ ఊహాగానాలు ఆగకపోవడంతో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తమ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి అమరీంద్ సింగేనని కుండబద్దలుకొట్టారు. సాధారణంగా బాదల్ (వర్షం) ని చూస్తే అంతా సంతోషిస్తారని, కానీ పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మాత్రం పంజాబ్ కు నీళ్లివ్వడం లేదని ఆయన చమత్కరించారు. అలాగే గురునానక్ 'అంతా నీదేనని' అంటారని, పంజాబ్ సీఎం మాత్రం 'అంతా నాదే'నని అంటున్నారని ఆయన చమత్కరించారు.
నాలుగేళ్ల క్రితం తాను పంజాబ్ వచ్చినప్పుడు పంజాబ్ లో 70 శాతం మంది యువత డ్రగ్స్ బానిసలుగా మారుతున్నారని ఆరోపించానని, అప్పుడు అంతా తన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారని, ఇప్పుడు అంతా తాను చెప్పిందే చెబుతున్నారని తెలిపారు. పంజాబ్ లో ఎక్కడికి వెళ్లాలన్నా బాదల్ బస్సుల్లోనే వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రతి పరిశ్రమలోనూ, వ్యాపారంలోనూ ఒక్క కుటుంబ ఏకస్వామ్యం నడుస్తోందని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత పంజాబ్ లో డ్రగ్స్ పేరు చెబితే వణకాలని, డ్రగ్స్ నిరోధానికి ప్రత్యేక చట్టం చేస్తామని అన్నారు. అలాగే పంజాబ్ ను ఎవరు గాయపరిచారో వారందర్నీ జైల్లో వేస్తామని ఆయన చెప్పారు. అవినీతిని అంతం చేస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అకాలీదల్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో అంతా సీఎం కుటుంబంపై అవినీతి ఆరోపణలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయి.