: వేసవికి ముందు భారీ వర్ష సూచన... బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో వాయుగుండాలు
వేసవి ప్రవేశించే ముందు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఏర్పడటమే ఇందుకు కారణమని అన్నారు. అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం పెరుగుతూ మన్నార్ జలసంధికి సమీపంలోకి వచ్చిందని, ఇది చెన్నై, ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు మాల్దీవుల సమీపంలో అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం పెరుగుతోందని వివరించారు.
వీటి కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతం కాగా, ముఖ్యంగా తమిళనాడు దక్షిణాది జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని తెలియజేశారు. ఇదిలావుండగా, తమిళనాడులోని కడలూరు, నాగపట్నం జిల్లాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ చేసిన 10 వేల వరి బస్తాలు తడిసిపోయాయి. దీంతో తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.