: గవర్నర్ వేషాలు తట్టుకోలేకపోతున్నాం...తొలగించండంటూ 'మేఘాలయ' రాజ్ భవన్ ఉద్యోగుల లేఖ
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ తివారీ ఏ కారణాలతో అయితే పదవి పోగొట్టుకున్నారో అలాంటి ఆరోపణలే మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్ పై కూడా వస్తున్నాయి. షణ్ముగనాధన్ ను తక్షణం గవర్నర్ పదవి నుంచి తొలగించాలంటూ షిల్లాంగ్ రాజ్ భవన్ కి చెందిన 80 మంది ఉద్యోగులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతటితో ఆగని ఉద్యోగులు...ఈ ఐదు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇందులో గవర్నర్ వ్యవహారశైలిని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. ఆయన చర్యలు రాజ్ భవన్ ప్రతిష్టను మంటగలుపుతున్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా రాజ్ భవన్ ఉద్యోగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వారు మండిపడ్డారు.
రాజ్ భవన్ లో ఉన్నామన్న ఇంగితం మరిచి ఆయన ప్రవర్తిస్తున్నారని, రాజ్ భవన్ ను ఆయన అమ్మాయిల క్లబ్ గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తామంతా తీవ్ర క్షోభకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఆయన ఆదేశాల మేరకే అమ్మాయిలు వచ్చిపోతున్నారని, వారు రాజ్ భవన్ కు ఉండే భద్రతా నియమావళిని కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. కాగా, షణ్ముగనాధన్ తమిళనాడు ఆర్ఎస్ఎస్ లో కీలక నేతగా పని చేశారు. 2015లో మేఘాలయ గవర్నర్ గా ఎన్డీయే ప్రభుత్వం ఆయనను నియమించింది. గత సెప్టెంబర్ లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించడం విశేషం. అయితే గత డిసెంబర్ లో పీఆర్వో ఉద్యోగానికి వెళ్లిన తనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నారని ఓ యువతి ఆరోపించగా, అది పెను దుమారం రేపింది.