: చంద్రబాబు గారు! మీ మీద పోరాడినట్టు ఎందుకు ఫీలవుతున్నారు?... ఆ ముద్ర వేసుకోకండి!: సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై పోరాటం అంటే ముఖ్యమంత్రి తనపై ప్రజలు పోరాడుతున్నట్టు ఎందుకు ఫీలవుతున్నారో అర్థం కావడం లేదని సినీ నటుడు, ప్రత్యేకహోదా సాధన సమితి నేత శివాజీ అన్నారు. యూఎస్ నుంచి లైవ్ ఛాట్ చేసిన శివాజీ మాట్లాడుతూ, ఎప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలు తలలు ఊపాలా? అని అడిగారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటే మీకు వచ్చిన ఇబ్బందేమిటో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు.
చంద్రబాబు గారు గతంలో విశాఖపట్టణంలో నిర్వహించిన సమ్మిట్ ద్వారా 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని అంటున్నారని, అవి ఎక్కడున్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చెయ్యడానికి ఎందుకీ డ్రామాలు? అని ఆయన ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుకు రైతు వ్యతిరేకి అని ఒక ముద్ర, ఉద్యోగి వ్యతిరేకి అని మరో ముద్ర ఉన్నాయని, ఇప్పుడు యువత వ్యతిరేకి అనే ముద్ర వేయించుకోవద్దని ఆయన సూచించారు. యువకులు మంచి ఉద్దేశంతో పోరాడుతున్నారని, వారికి సాయం చేయాల్సిన బాధ్యత, మద్దతుగా నిలవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని ఆయన తెలిపారు.