: పెట్టుబడులు వస్తాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: టీడీపీకి బొత్స సత్యనారాయణ సవాల్
పెట్టుబడులు ఆకర్షించేందుకంటూ టీడీపీ ఏర్పాటు చేసే కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో సదస్సు ఉందని ప్రభుత్వం చెబుతోందని, ఇలాంటి సదస్సుల వల్ల కనీసం 40 శాతం పెట్టుబడులు వచ్చాయని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కేవలం ఫోటోల కోసమే విశాఖ సదస్సు జరుగుతుందని ఆయన అన్నారు. గతేడాది వచ్చిన ఫోటోలే ఈ ఏడాది కూడా కనిపిస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం యువకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని ఆయన పేర్కొన్నారు. రేపు జరిగే అందోళనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే... ప్రత్యేకహోదాను రాష్ట్రప్రభుత్వమే అడ్డుకుంటున్నట్టు భావించాల్సి వస్తుందని అన్నారు.