: రూ. పది నాణేలు రద్దు చేస్తారంటూ వదంతులు.. దేవుడికి కానుకగా సమర్పిస్తున్న ప్రజలు!
పెద్ద నోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలను ఇప్పుడు మరో ప్రచారం ఉలికిపాటుకు గురి చేస్తోంది. త్వరలో పది రూపాయల నాణేలను కూడా రద్దు చేయనున్నారంటూ తమిళనాడులో గత కొన్ని రోజులుగా వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో తమ వద్ద ఉన్న రూ.పది నాణేలను వదిలించుకునేందుకు ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు. వీటిని తీసుకునేందుకు వ్యాపారులు, ఇతరులు విముఖత చూపుతుండడంతో వాటిని దేవుడి హుండీలో వేసేస్తున్నారు. తమ వద్ద ఉన్న నాణేలను ఇలా దేవుడికి కానుకగా సమర్పిస్తున్నారు. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని మురుగన్ ఆలయంలోని హుండీని మంగళవారం అధికారులు లెక్కించారు. ఇందులో వేల సంఖ్యలో రూ.10 నాణేలు ఉండడంతో ఆలయ అధికారులు ఆశ్చర్యపోయారు. వదంతుల కారణంగానే ప్రజలు ఇలా నాణేలను హుండీలో వేస్తున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.