: ముద్రగడ పాదయాత్రకు లేఖ ఇస్తే అనుమతినిస్తాం: డిప్యూటీ సీఎం చిన రాజప్ప
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టనున్న కాపు సత్యాగ్రహ పాదయాత్రకు ఆయన లేఖ ఇస్తే అనుమతినిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు తునిలో నిర్వహించిన సభకు అనుమతి లేదని, ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో అనుమతి ఉంటేనే ఆయన పాదయాత్రకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
కాగా, కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ, రావులపాలెం నుంచి రేపు పాదయాత్ర నిర్వహించనున్నారు. అమలాపురం మీదుగా ఆరురోజుల పాటు కొనసాగే ఈ యాత్ర అంతర్వేదిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ముద్రగడ రావులపాలెం బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, పాదయాత్ర నిర్వహించి తీరతామని కాపు జేఏసీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా, ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.