: బ్యాంక్ కు తాళాలు వేయడం మరచిన సిబ్బంది.. బేడీలు వేసిన పోలీసులు!
అనంతపురం జిల్లా యాడికిలోని సిండికేట్ బ్యాంక్ నిన్న అర్థ రాత్రి సమయంలో బార్లా తెరిచి ఉండటంతో అక్కడ గస్తీ కాస్తున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో బ్యాంకులో లైట్లు వెలుగుతూ, తలుపులు తెరచి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బ్యాంకులో దొంగలు పడ్డారేమోననే అనుమానంతో సుమారు పావు గంట పాటు బ్యాంకు బయటే పోలీసులు వేచి చూశారు.
ఆ తర్వాత, పోలీసులు బ్యాంకు లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ విషయమై అడుగుదామని బ్యాంకు మేనేజర్ కు, ఇతర సిబ్బందికి వారు ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో, చేసేదేమీ లేక, బ్యాంకు తలుపులకు వారి వద్ద ఉన్న బేడీలు వేశారు. విధులు ముగించుకుని వెళ్లిపోయిన బ్యాంకు సిబ్బంది, తాళాలు వేయడం మరచిపోయారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ప్రసార మాధ్యమాల ద్వారా ఈ వార్త హల్ చల్ చేస్తున్నప్పటికీ, ఈరోజు ఉదయం 9 గంటల వరకు బ్యాంకు సిబ్బంది అక్కడికి వెళ్లకపోవడం గమనార్హం.