: బాలీవుడ్ మూవీ ‘రయీస్’ ప్రమోషన్ లో విషాదం...షారూక్ అభిమాని మృతి!
ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ నటించిన ‘రయీస్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీకి ‘రయీస్ బై రైల్’ కార్యక్రమంలో భాగంగా వడోదర రైల్వేస్టేషన్ కు ఈ చిత్ర బృందం చేరింది. ఈ క్రమంలో షారూక్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.దీంతో, పోలీసులు లాఠీఛార్జి చేయడంతో జరిగిన తొక్కిసలాట కారణంగా షారూక్ ఖాన్ అభిమాని ఒకరు మృతి చెందాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... షారూక్ ముంబయి సెంట్రల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు అగస్త్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించాడు. షారూక్ ప్రయాణిస్తున్న రైలు సోమవారం రాత్రి 10.30 గంటలకు వడోదర రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నెంబర్ 6కు చేరుకుంది. ఇక్కడ పది నిమిషాలు మాత్రమే ఆగడంతో, షారూక్ అభిమానులు ఆయన్ని చూడాలనే ఉత్సాహంతో ఒక్కసారిగా రైలు వైపు దూసుకెళ్లి, విండోలపై కొట్టారు. దీంతో, అభిమానులను పోలీసులు అదుపు చేశారు.
అయితే, రైలు బయలుదేరిన వెంటనే అభిమానులు కూడా ఆ రైలు వెంట పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, షారూక్ ను కలిసేందుకు వచ్చిన వారిలో ప్రముఖ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసప్ పఠాన్ లూ ఉన్నారు. బోగిలోకి వెళ్లి షారూక్ ను వారు కలుసుకున్నారు.