: మధ్య తరగతి ప్రజలకు శుభవార్త.. ఆదాయపన్ను పరిమితి పెంపు?


ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌రుగుతున్న వేళ విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ వ‌చ్చేనెల‌ 1నే వార్షిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఈ బడ్జెట్‌పై ఆర్థిక విశ్లేష‌కుల నుంచి ఎన్నో ఊహాగానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో మ‌ధ్య‌తర‌గ‌తి ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురైన ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ స‌ర్కారు వారికి ఊర‌ట క‌లిగించే విధానాల‌ను ఈ బ‌డ్జెట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఈ బడ్జెట్‌లో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పరిశోధన నివేదిక ఎకోరాప్‌ అంచనా ప్ర‌కారం, వ్యక్తిగత ఆదాయపన్ను, సెక్షన్‌ 80సీ పరిమితులు పెంచడంతో పాటు గృహ రుణాలను మరింత చౌకగా చేసేలా ఈ బడ్జెట్‌ ఉంటుంది.

ప్రస్తుతం ఆదాయపన్ను పరిమితి రూ.2.5లక్షలు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రిమితిని రూ.3 లక్షలకు పెంచుతూ జైట్లీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని ఆ నివేదిక తెలుపుతోంది. సెక్షన్‌ 80సీ కింద ఉన్న పరిమితిని కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచే అవ‌కాశం ఉంది. గృహ రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచనున్నారు. పన్ను మినహాయింపు కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లాకిన్‌ పీరియడ్‌ను ఐదేళ్లనుంచి మూడేళ్లకు తగ్గించే అవకాశం ఉంది. ఎస్‌బీఐ రూపొందించిన‌ ఈ నివేదిక‌ను ఎస్‌బీఐ గుర్తింపు పొందిన, ఆర్థిక పరిశోధనశాఖకు చెందిన చీఫ్‌ ఆర్థిక సలహాదారు సౌమ్య ఘోష్‌ కూడా ధ్రువీకరించారు. ఈ ప‌రిమితుల‌ను పెంచ‌డం ద్వారా కేంద్ర స‌ర్కారుకి అదనంగా రూ.35,300కోట్ల భారం ప‌డుతుందని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుతం కేంద్ర ఆర్థిక శాఖ ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆదాయ వెల్లడి పథకం- 2 (ఐడీఎస్‌2) ద్వారా కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌రింత న‌గ‌దు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, ఆ న‌గ‌దు ద్వారా ఈ స‌వ‌ర‌ణ‌ల‌తో స‌ర్కారుకి ఏర్ప‌డే లోటును కేంద్ర ప్ర‌భుత్వం పూడ్చుకుంటుంద‌ని ఆయ‌న చెప్పారు. ఐడీఎస్‌ పథకం ద్వారా రూ.50 వేల కోట్లు వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. అంతేగాక‌ ఆర్‌బీఐపై నోట్ల భారాన్ని తగ్గించడం వల్ల మ‌రో రూ.75వేల కోట్లు వ‌స్తాయ‌ని ఎస్‌బీఐ త‌న నివేదికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News