: బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు: టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్
టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు, రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ భ్రష్టుపట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో టీఎస్టీఎఫ్ క్యాలెండర్, డైరీ ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని, బడ్జెట్ లో విద్యకు తక్కువ నిధులు కేటాయించిన రాష్ట్రం దేశంలో ‘తెలంగాణ’ ఒక్కటేనని, ఫీజు రీయింబర్స్ మెంట్ కు గండి కొట్టారని, యూనివర్శిటీలలో సైతం నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇంత వరకూ వేయలేదని, బీఏడ్, డీఎడ్ కాలేజీలను మూసివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వంతో పోరాడతామని, ఉద్యోగులకు పీఆర్సీ వచ్చే వరకు వారికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.