: దావోస్ పర్యటనపై విమానంలోనే చంద్రబాబు సమీక్ష.. ఏపీ బ్రాండ్ కోసం చేసిన కృషి ఫలించిందంటూ సంతృప్తి
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని తిరిగి భారత్ బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం విజయవాడ చేరుకున్నారు. ఈ క్రమంలో జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి వస్తూ విమానంలోనే ఉన్నతాధికారులతో తన పర్యటనపై సమీక్ష నిర్వహించారు. సీఎం ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, ఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియారాజ్‌లతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దావోస్ పర్యటన ఫలితాలు ఇచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ కోసం చేసిన కృషి సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. దావోస్ వీధుల్లో ఏపీ ప్రచార రథాన్ని తిప్పడంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారతదేశంలో మొదటి స్థానాన్ని సాధించడం, ఏపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం వంటి అంశాలపై హోర్డింగులు పెట్టడం ద్వారా సమావేశాలకు వచ్చిన ప్రతినిధుల దృష్టిని ఆకర్షించామన్నారు. వచ్చే ఏడాది సమావేశాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే వచ్చే ఏడాది జరిగే సమావేశాల్లో ఏపీ తరపున విందు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా దావోస్ పర్యటనకు అసలు ఆహ్వానమే అందలేదన్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం కొట్టిపడేసింది. సదస్సుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ బోర్డు సభ్యుడు ఫిలిప్ రోస్లర్ పంపిన ఆహ్వాన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది.