: బంగ్లాదేశ్ క్రికెటర్ అర్ఫాత్ సన్నీ అరెస్టు.. నేరం నిరూపితమైతే 14 ఏళ్ల జైలు శిక్ష!
తన గర్ల్ ఫ్రెండ్‌కు సంబంధించిన పలు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ అర్ఫాత్ సన్నీని పోలీసులు అరెస్టు చేశారు. తన అభ్యంతకర ఫొటోలను అర్ఫాత్ పోస్ట్ చేశాడని ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నామని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ రోజు ఢాకాలోని ఆర్ఫాత్ గృహంలో తనిఖీలు చేశామని తరువాత అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
తన గర్ల్ ఫ్రెండ్ పేరుతో సదరు క్రికెటర్ ఓ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి.. తనతో ఆమె సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో ఆమెతో దిగిన కొన్ని అభ్యంతకర ఫొటోలను అందులో పెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి కేసును న్యాయస్థానానికి అప్పగించామని చెప్పారు. ఐదు రోజుల కస్టడీ కోరనున్నట్లు తెలిపారు. ఆయన తప్పు చేసినట్లు నిరూపితమైతే దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. ఆ దేశ చట్టం ప్రకారం వివాదాస్పద ఫొటోలను పోస్ట్ చేస్తే కఠిన శిక్ష పడుతుంది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించలేదు.