: క్రికెట్ కప్పు గెలిచిన 30 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా ఆటగాళ్లకు నేడు మెడల్స్!
1987లో ఇండియా, పాకిస్థాన్ సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్ కప్ క్రికెట్ పోటీలో విజేతగా నిలిచిన అలెన్ బార్డర్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు నేడు మెడల్స్ దక్కనున్నాయి. అప్పట్లో ఆటగాళ్లకు కేవలం ట్రోఫీని మాత్రమే బహూకరించారు. 14 మంది ఆటగాళ్లకు, అప్పటి కోచ్ బాబ్ సింప్సన్, టీమ్ మేనేజర్ అలెన్ క్రాంప్టన్, సైకోథెరపిస్ట్ ఎలాల్ ఆల్కాట్ లకు ఆదివారం నాడు మెడల్స్ బహూకరించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్, ఐసీసీ డైరెక్టర్ డేవిడ్ పీవర్ వెల్లడించారు. పాకిస్థాన్ తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న నాలుగో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ లో ఈ ఉత్సవం జరిపిస్తామని చెప్పారు. కాగా, 1987లో ఇంగ్లండ్ ను ఫైనల్లో ఓడించి, కప్పును గెలుచుకున్న ఉత్సాహం ఆస్ట్రేలియా క్రికెట్ ను ఉన్నత స్థితికి చేర్చగా, ఆపై 1999, 2003, 2007, 2015లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో ఆ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.