: నీతో బాలయ్య కాంబినేషన్ కుదరదనే అనుకున్నా: క్రిష్ కు ప్రత్యేక లేఖ రాసిన రాజమౌళి
తాను చూసిన ఏ చిత్రమైనా నచ్చితే స్పందించి అభినందించే దర్శకుడు రాజమౌళి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర దర్శకుడు క్రిష్ ను అభినందిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. తన భావాలను స్వయంగా పంచుకుంటూ, వీలు చూసుకుని తీరికగా చదువుకోవాలని చెప్పాడు. సినిమా ప్రారంభానికి ముందు తనకెన్నో అనుమానాలు కలిగాయని, ఆపై చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యాక ఆశ్చర్యపోయానని, సినిమా చూశాక అద్భుతమనిపించిందని కొనియాడాడు.
గమ్యం, వేదం వంటి చిత్రాలు తీసిన క్రిష్ కు, బాలయ్యకు పొంతన కుదరదని అనుకున్నానని, వింత కాంబినేషన్ అని భ్రమ పడ్డానని చెప్పాడు. ఈ చిత్రానికి కథ తయారు చేసుకునేందుకు సంవత్సర కాలం పడుతుందని అనుకున్నానని, తెలియని చక్రవర్తి చరిత్రను ప్రేక్షకులు ఆదరించరని భావించానని చెప్పాడు.
వినడానికే ఆశ్చర్యం కలిగించేలా 79 రోజుల్లో షూటింగ్ ముగించారని తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పాడు. మొదటి శతాబ్దపు యుద్ధ కథ అని తెలుసుకుని, షూటింగ్ ఎలా చేశారు? దుస్తులు ఎవరు డిజైన్ చేశారు? సెట్స్ ఎక్కడ వేశారు? ఒక యుద్ధం ఎన్ని రోజుల్లో తీశారు? తక్కువ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా పూర్తి చేశారు? వంటి ప్రశ్నలు తన మదిని దోచేవని చెప్పాడు. సినిమా చూసిన తరువాత అనుమానాలు పటాపంచలు కాగా, అద్భుతమనిపించిందని కితాబిచ్చాడు.