: ఆ రికార్డు తనపేరిటే ఉండాలని కోరుకుంటున్న గేల్
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఇతర రికార్డుల సంగతేమో కానీ ఒక రికార్డు మాత్రం తన పేరిటే ఉండాలని కోరుకుంటున్నాడు. క్రీజులో దిగితే చెలరేగిపోయే గేల్ తనకు 50 ఏళ్లు వచ్చే వరకు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాడు. సుదీర్ఘ కాలం అంటే 50 ఏళ్ల వయసు వరకు క్రికెట్ ఆడిన వ్యక్తిగా క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు, ఎవరూ తిరిగరాయలేని రికార్డును తనపేరిట నెలకొల్పాలని భావిస్తున్నానని చెప్పాడు. అలా ఆడడం వల్ల ఏదో ఒకరోజు తన ఆటను తన కుమార్తె చూస్తుందని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తన కుమార్తె తన ఆటచూడాలని కోరుకుంటున్నానని గేల్ తెలిపాడు.
2014 సెప్టెంబర్ నుంచి టెస్టు క్రికెట్ కు దూరమైన గేల్ టీ20 ఫార్మాట్ ను కేంద్రంగా చేసుకుని రికార్డుల దుమ్ముదులుపుతున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో గేల్ ఇప్పటి వరకు 9,777 పరుగులు చేశాడు. ఐపీఎల్, కరీబియన్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ క్రికెట్ లీగ్, కౌంటీ వంటి అన్ని రకాల టీ20 సిరీస్ లలో పాల్గొనే గేల్ 50 ఏళ్ల వయసు వచ్చే వరకు క్రికెట్ లో కొనసాగితే రికార్డుల మోత మోగాల్సిందేననడంలో ఎలాంటి సందేహం లేదు.