: ఇప్పుడు, మీరే గురువులు.. నేనే మీ అభిమానిని: కమలహాసన్
‘జల్లికట్టు’పై కేంద్రం ప్రభుత్వం నిషేధం ఎత్తి వేయాలంటూ తమిళ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై ప్రముఖ నటుడు కమలహాసన్ ప్రశంసలు కురిపించారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదలను ప్రశంసించిన ఆయన, అహింసాయుతంగా ఇదే తీరులో ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘ఇప్పుడు, మీరే గురువులు.. నేనే మీ అభిమానిని.. ఇది ప్రజల ఉద్యమం. సెలబ్రిటీలు కేవలం వాళ్లకు మద్దతు మాత్రమే ఇవ్వాలి కానీ, అందరి దృష్టి తమపై పడేలా చేసుకోవడాన్ని నేను అంగీకరించను. ప్రపంచం మనల్నే చూస్తోంది.. భారత్ గర్వపడేలా తమిళులు చేస్తున్నారు..’ అంటూ కమల్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, 1930లో శాసనోల్లంఘన ఉద్యమానికి మ్యానిఫెస్టో రూపొందించింది మద్రాసులోనేనని, దానిని 2017లో తమిళనాడులో విజయవంతంగా ఆచరిస్తున్నారని కమల్ అన్నారు. తమిళనాడులో ఒక్కో రాజకీయ పార్టీకీ ఒక్కో టీవీ ఛానెల్ ఉందని, వార్తల్లో పక్షపాతం కన్పిస్తున్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతే విజయం తథ్యమని కమల్ అన్నారు. కాగా, చెన్నైలోని మెరీనా బీచ్ లో ‘జల్లికట్టు’ మద్దతుదారులు, యువత శాంతియుత మార్గంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు, సినీ నటులు, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.