: కేరళ సీఎం బస చేసిన గది తాళం పడలేదని అధికారిపై వేటు!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బస చేసిన గెస్ట్ హౌస్ లో డోర్ లాక్ పడకపోవడంతో ఇందుకు బాధ్యుడిని చేస్తూ ప్రజా పనుల శాఖ ఏఈని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోని 107 నెంబర్ గదిలో గత ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆయన బస చేశారు. సీఎం బస చేసిన మొదటి రోజు నుంచి ఆ గది డోర్ లాక్ పడటం లేదు.
దీంతో, ఈ విషయాన్నిగెస్ట్ హౌస్ మేనేజర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో, కార్పెంటర్లను పంపి డోర్ లాక్ ను సరిచేయించారు. ఆ తర్వాత డోర్ లాక్ చేసేందుకు సీఎం ప్రయత్నించినా పడలేదు. దీంతో, ఆగ్రహించిన సీఎం, తనకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటే, ఇక, సామాన్యుల పరిస్థితి ఏంటంటూ అధికారులపై మండిపడ్డారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు, ప్రజా పనుల శాఖ ఏఈని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ సంఘటనపై కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ వర్గీయులు విమర్శిస్తున్నారు. అచ్యుతానందన్ సీఎంగా ఉన్నప్పుడు గతంలో ఇదే గదిలో బస చేశారట. ఆయనెప్పుడూ డోర్ లాక్ చేసుకోలేదట. అత్యంత భద్రత ఉండే సీఎంకు డోర్ లాక్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అచ్యుతానందన్ వర్గీయులు విమర్శిస్తున్నారు.