: ప్రియాంకా గాంధీ 11 మెసేజ్ లు పెట్టినా.. సమాధానం ఇవ్వని అఖిలేష్!
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో యూపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనే తరుణంలో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లు జతకడతాయని అందరూ భావించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కూడా ఎస్పీతో పొత్తు పెట్టుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ ఏకంగా 210 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడంతో, కాంగ్రెస్ పార్టీకి గుబులు పట్టుకుంది.
ఇంకా పొత్తు ఖరారు కాకముందే జాబితాను విడుదల చేయడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. అందులోనూ, గాంధీ కుటుంబానికి కంచుకోటలైన అమేథీ, రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎస్పీ తన అభ్యర్థులను ప్రకటించడంతో, కాంగ్రెస్ షాక్ అయింది. వాస్తవానికి ఈ రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేయాలనేది కాంగ్రెస్ భావన.
ఈ అంశం గురించి మాట్లాడేందుకు, ప్రియాంకా గాంధీ 11 మెసేజ్ లు పెట్టినా... అఖిలేష్ నుంచి సమాధానం రాలేదట. మరోవైపు ప్రియాంక దూత ధీరజ్... అఖిలేష్ అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారట. అఖిలేష్ ఇలా చేస్తారని కాంగ్రెస్ నేతలు అసలు ఊహించలేదట. దీంతో, ఈ పొత్తుల వ్యవహారం అయోమయంలో పడ్డట్టేనని విశ్లేషకులు అంటున్నారు.